హసన్ పర్తి లో గ్రంథాలయం, కంప్యూటర్ ల్యాబ్, ఆడిటోరియం ప్రారంభోత్సవాలు

 


హసన్‌పర్తి ప్రభుత్వ పాఠశాల, జూనియర్ కళాశాలలో  గ్రంథాలయం, కంప్యూటర్ ల్యాబ్, ఆడిటోరియం ప్రారంభోత్సవాలు


హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో దాతల సహకారంతో నిర్మించిన గ్రంథాలయం, కంప్యూటర్ ల్యాబ్, ఆడిటోరియంను శుక్రవారం వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, ఐపీఎస్ అధికారి చెన్నూరి రూపేష్ ప్రారంభించారు.
ఈ సదుపాయాలు మహర్షి ఫౌండేషన్ ఆధ్వర్యంలో, వివిధ సంస్థల భాగస్వామ్యంతో రూ.42 లక్షల వ్యయంతో ఏర్పాటు చేయబడ్డాయి.
ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని, కళాశాలలో నిర్మించిన ఆడిటోరియానికి ఫర్నిచర్‌ను సొంత నిధులతో అందజేస్తానని తెలిపారు. క్రీడా మైదానం అభివృద్ధికి కూడా నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు.
జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ విద్య జీవితం కోసం బలమైన పునాది అని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే చదివిన వారని గుర్తుచేశారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగి, భవిష్యత్తులో సమాజానికి తిరిగి సేవ చేయాలని పిలుపునిచ్చారు.
పాఠశాల పూర్వ విద్యార్థి, ఐపీఎస్ అధికారి చెన్నూరి రూపేష్ మాట్లాడుతూ తన విజయానికి పాఠశాలే పునాది అని, అందుకే తిరిగి పాఠశాల అభివృద్ధికి తోడ్పడుతున్నానని తెలిపారు. విద్యార్థులు కల్పించిన సదుపాయాలను సద్వినియోగం చేసుకుని గొప్ప వ్యక్తులుగా ఎదగాలని సూచించారు.
ఈ సందర్భంగా ఇంటర్మీడియట్‌లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు రూ.60 వేల నగదు ప్రోత్సాహకాన్ని స్వాన్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సత్యనారాయణ, డైరెక్టర్ అరుణ అందజేశారు. పాఠశాల అభివృద్ధికి సహకరించిన దాతలను ఘనంగా సత్కరించారు.
కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్, డీఐఈవో గోపాల్, ఎంఈఓ శ్రీనివాస్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, మహర్షి ఫౌండేషన్ ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు