హనుమకొండ, ఫిబ్రవరి 17, 2026:
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పాఠ్యాంశాలు సులభంగా అర్థమయ్యేలా ఉపాధ్యాయులు సృజనాత్మక పద్ధతుల్లో బోధించాల్సిన అవసరం ఉందని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ పేర్కొన్నారు.
మంగళవారం కమలాపూర్ మండలం గూడూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఉన్నత పాఠశాలను సందర్శించిన ఆమె విద్యార్థుల హాజరు వివరాలను పరిశీలించి, ముఖ గుర్తింపు విధానంలో హాజరు నమోదు ప్రక్రియను స్వయంగా తనిఖీ చేశారు. ఆరు మరియు పదో తరగతుల తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో మాట్లాడి బోధనపై అభిప్రాయాలు తెలుసుకున్నారు.
‘లెట్స్ ఎన్ రిచ్ ఇంగ్లీష్’ పాఠ్యాంశ బోధనను పరిశీలించిన కలెక్టర్, విద్యార్థుల ఆంగ్ల ప్రావీణ్యంపై సంతృప్తి వ్యక్తం చేశారు. బోధిస్తున్న పాఠ్యాంశాలు విద్యార్థులకు స్పష్టంగా అర్థమవుతున్నాయా అనే విషయాన్ని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.
ప్రాథమిక పాఠశాలలో అన్ని తరగతులను పరిశీలించిన ఆమె, ఐదో తరగతి విద్యార్థులతో ఆంగ్లంలో సంభాషించి వారి పఠన నైపుణ్యాలను పరీక్షించారు. పాఠశాల ప్రాంగణ పరిశుభ్రత, తాగునీటి సదుపాయాలు, వంటగది, మరుగుదొడ్ల నిర్మాణ స్థితిని కూడా పరిశీలించారు. అసంపూర్తిగా, నిరుపయోగంగా ఉన్న నిర్మాణాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, రెండు రోజుల్లో పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని డీఈఓను ఆదేశించారు.
క్లాస్‌రూమ్‌లు అందుబాటులో ఉన్నప్పటికీ విద్యార్థులను బయట కూర్చోబెట్టడం తగదని సూచించారు. పాఠశాల వాతావరణం పరిశుభ్రంగా, సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. మధ్యాహ్న భోజన నాణ్యతపై కూడా ఆరా తీశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు ఆంగ్ల భాషలో పట్టు సాధించేందుకు ప్రత్యేక శ్రద్ధ అవసరమని పేర్కొన్నారు. పదాల సరైన ఉచ్చారణ, అర్థ వివరణతో పాటు ఆంగ్ల పదాలను తెలుగులో స్పష్టంగా అనువదించి బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. చదివినది అర్థం చేసుకోవడం అత్యంత ముఖ్యమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీఈవో ఎల్.వి. గిరిరాజ్ గౌడ్, తహసిల్దార్ సురేష్ కుమార్, ఎంపీడీవో గుండె బాబు, ఎంఈఓ శ్రీధర్, ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

0 కామెంట్‌లు