పదేళ్లలో బి ఆర్ ఎస్ ఫెయిల్యూర్స్- ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

 


హనుమకొండలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మీడియా సమావేశం

బీఆర్‌ఎస్‌పై ఘాటు విమర్శలు – అభివృద్ధి అంశంపై చర్చకు సవాల్

హనుమకొండ, ఫిబ్రవరి 24:

వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి హనుమకొండ బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్‌ఎస్ నాయకత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 

పదేళ్ల పాలనలో అభివృద్ధి పనులు చేపట్టడంలో విఫలమైన బీఆర్‌ఎస్, ఇప్పుడు అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.

డబ్బు రాజకీయాలకు మాత్రమే పరిమితమైన బీఆర్‌ఎస్ నాయకులు జిల్లాల్లో పర్యటనలు చేస్తూ విమర్శలకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన అన్నారు. “పదేళ్లలో చేసిందేమీ లేకపోవడంతో రోజువారీ ఆరోపణలకే పరిమితమవుతున్నారు” అని వ్యాఖ్యానించారు.

మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి విషయంలో ప్రభుత్వం సమగ్రంగా పరిశీలిస్తున్నదని తెలిపారు. దాదాపు పూర్తికావొచ్చిన ఆస్పత్రిపై పూర్తి వివరాలు తెలుసుకోకుండా బయట నుంచే విమర్శలు చేయడం తగదని సూచించారు. సీటీ స్కాన్, ఎంఆర్ఐ వంటి ఆధునిక పరికరాలు విదేశాల నుంచి రానుండటంతో కొంత ఆలస్యం సహజమని వివరించారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాను విభజించినప్పుడు, నిధుల కేటాయింపుల విషయంలో బీఆర్‌ఎస్ నాయకులు ఎప్పుడైనా ప్రశ్నించారా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. “మీ పాలనలో జరిగిన అభివృద్ధి ఎంత? గత రెండేళ్లలో జరిగిన అభివృద్ధి ఎంత? ప్రజల ముందుకు వచ్చి చర్చకు సిద్ధమా?” అని సవాల్ విసిరారు.

బినామీ పేర్లతో కోట్ల రూపాయలు కూడబెట్టిన నేతలు ఇప్పుడు పారదర్శకత గురించి మాట్లాడటం ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. టెక్స్టైల్ పేరుతో ప్రకటించిన భారీ ప్రాజెక్టులు భూమి దశ దాటలేదని విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గణనీయమైన అభివృద్ధి జరుగుతోందని, రెండున్నరేళ్లలో ప్రారంభించిన పనులు ఎటువంటి అవకతవకలు లేకుండా కొనసాగుతున్నాయని తెలిపారు. కాంట్రాక్టర్లపై కమిషన్ల ఒత్తిడి లేదని స్పష్టం చేశారు. “సలహాలు ఉంటే ఇవ్వండి. ఎన్నికల వరకు రాజకీయాలు చేద్దాం. కానీ దాడుల రాజకీయాలను నేను ఎప్పుడూ ప్రోత్సహించలేదు” అని పేర్కొన్నారు.

పట్టణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. “మీరు ఓటు వేయకపోతే గూండాలు, రౌడీలు రాజ్యమేలే పరిస్థితి వస్తుంది. చదువుకున్న విజ్ఞవంతులుగా సరైన నాయకుడిని ఎన్నుకోవాలి. ప్రజల తీర్పే తుది తీర్పు” అని అన్నారు.

ఈ సమావేశంలో ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్, జిల్లా ఆర్టీఏ సభ్యుడు పల్లకొండ సతీష్, ఆలయ కమిటీ డైరెక్టర్ సతీష్, బ్లాక్ అధ్యక్షులు బంక సంపత్, లక్ష్మారెడ్డి, నాయకులు నలుబోల సతీష్, సుగుణాకర్ రెడ్డి, తడుక సుమన్, పున్నం, నాగరాజు, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు