రాష్ట్ర పోలీస్ క్రీడల్లో సత్తా చాటిన వరంగల్ కమిషనరేట్ పోలీసులు

 


సైబరాబాద్ వేదికగా జరిగిన నాల్గవ రాష్ట్ర పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌లో వరంగల్ కమిషనరేట్ పోలీస్ క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయిలో తమ సత్తా చాటారు. ఆరు రోజుల పాటు ఉత్సాహంగా సాగిన ఈ క్రీడలు శనివారం రాత్రి ఘనంగా ముగిశాయి.

ఈ పోటీల్లో వరంగల్ కమిషనరేట్ మొత్తం 86 పతకాలను సాధించి పతకాల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. అందులో 12 స్వర్ణ పతకాలు, 25 రజత పతకాలు, 49 కాంస్య పతకాలు ఉండటం విశేషం. ముఖ్యంగా అర్చరీ విభాగంలో వరంగల్ క్రీడాకారులు ఐదు స్వర్ణ పతకాలతో సహా మొత్తం 13 పతకాలను కైవసం చేసుకుని తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించారు.

జూడో పోటీల్లో నాలుగు రజత పతకాలు సాధించి జూడో చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచి, ముఖ్య అతిథుల చేతుల మీదుగా ట్రోఫీ అందుకున్నారు. బాక్సింగ్, ఆర్మ్ రెజ్లింగ్, రెజ్లింగ్, వెయిట్‌లిఫ్టింగ్, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, టగ్ ఆఫ్ వార్, సైక్లింగ్, స్విమ్మింగ్, హాకీ వంటి విభాగాల్లోనూ గతంతో పోలిస్తే మెరుగైన ప్రదర్శన కనబరిచారు.

వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ స్వయంగా కాంస్య పతకం సాధించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే పోలీస్ చరిత్రలో ఇప్పటివరకు ఫుట్‌బాల్‌లో పతకం సాధించని వరంగల్ కమిషనరేట్ ఈసారి కాంస్య పతకం దక్కించుకోవడం క్రీడాకారుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది.

ఈ విజయానికి కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ అందించిన ప్రోత్సాహమే ప్రధాన కారణమని క్రీడాకారులు అభిప్రాయపడ్డారు. క్రమశిక్షణ, కఠిన శిక్షణ, ఉన్నతాధికారుల మద్దతుతో వరంగల్ కమిషనరేట్ రాష్ట్ర స్థాయిలో ప్రతిష్టాత్మక స్థానం సాధించిందని అధికారులు తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు