భూపాలపల్లి కోర్టు సిబ్బంది అరెస్ట్
పెద్దపల్లి సబ్ రిజిస్ట్రార్ సహా నలుగురు ఏసీబీ వలలో
జయశంకర్ భూపాలపల్లి / పెద్దపల్లి:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన మరియు సెషన్స్ కోర్టులో పనిచేస్తున్న ముగ్గురు సిబ్బంది లంచం తీసుకుంటూ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు. అదే సమయంలో పెద్దపల్లి జిల్లాలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో లంచం వ్యవహారం కూడా బయటపడింది.
భూపాలపల్లిలో కోర్టు సిబ్బంది అరెస్ట్
జిల్లా ప్రధాన మరియు సెషన్స్ కోర్టులో స్టెనో గ్రేడ్-1గా విధులు నిర్వహిస్తున్న పాలకుర్తి సాయి చరణ్, ఏ.ఎస్. నం. 03/2023 కేసుకు సంబంధించిన తీర్పు కాపీ అందజేయడానికి ఫిర్యాదుదారుడి నుండి రూ.5,000 లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ మొత్తాన్ని తన సబార్డినేట్లుగా పనిచేస్తున్న కొమ్ము సునీత, పున్నం రజితల ద్వారా స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు దాడి నిర్వహించి ముగ్గురినీ పట్టుకున్నారు. లంచం మొత్తం స్వాధీనం చేసుకున్న అధికారులు, వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పెద్దపల్లిలో సబ్ రిజిస్ట్రార్
ఇదే తరహాలో పెద్దపల్లి జిల్లా మంథని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కూడా ఏసీబీ దాడులు జరిగాయి. సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న కాసర్ల రాజేందర్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. సుబరిజిస్ట్రార్ రాజేందర్ భూమి కొనుగోలు చేసిన యజమాని నుండి రూ.16,500 లంచం డిమాండ్ చేసాడు.
ఈ మొత్తాన్ని ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్ రషీద్ ద్వారా స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
అవినీతి సహించమని ఏసీబీ హెచ్చరిక
ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలు డిమాండ్ చేసే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీబీ డి ఎస్పీ సాంబయ్య స్పష్టం చేశారు. ప్రజలు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే అవినీతి నిరోధక శాఖను సంప్రదించాలని సూచించారు.


0 కామెంట్‌లు