జనధన్ ఖాతాలు, పెండింగ్ బీమా క్లెయిమ్‌లపై లోక్‌సభలో ప్రశ్నించిన వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య



 న్యూఢిల్లీ / పార్లమెంట్

డార్మెంట్ జనధన్ ఖాతాలు, పెండింగ్ బీమా క్లెయిమ్‌లపై లోక్‌సభలో ప్రశ్నించిన వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య

ప్రధాన మంత్రి జనధన్ యోజన (PMJDY) కింద ప్రారంభించిన ఖాతాల్లో భారీ సంఖ్యలో నిష్క్రియ (డార్మెంట్) ఖాతాలు కొనసాగుతుండటంపై, అలాగే ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY), ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన (PMSBY) కింద బీమా క్లెయిమ్‌లు పెండింగ్‌లో ఉండటంపై వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య లోక్‌సభలో ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ అంశంపై ఎంపీ డా. కడియం కావ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానం ఇచ్చారు. ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం, వరంగల్, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, జనగాం జిల్లాల పరిధిలో జనధన్ ఖాతాల సంఖ్య 2023 మార్చిలో ఉన్న 10.80 లక్షల నుంచి 2025 మార్చికి 12.50 లక్షలకు పెరిగింది. అయితే, ఈ ఖాతాల్లో గణనీయమైన సంఖ్య ఇప్పటికీ వినియోగంలోకి రాకపోవడం గమనార్హమని పేర్కొన్నారు.

2026 జనవరి 21 నాటికి వరంగల్ జిల్లాలోనే సుమారు 2.99 లక్షల జనధన్ ఖాతాలు డార్మెంట్‌గా ఉన్నట్లు కేంద్రం అంగీకరించింది. వీటిలో అత్యధికంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద 1.46 లక్షల ఖాతాలు ఉండగా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ తదితర బ్యాంకులు తరువాతి స్థానాల్లో ఉన్నట్లు వెల్లడైంది. అయితే బ్యాంకుల వారీగా డార్మెంట్ ఖాతాల వివరాలను కేంద్ర స్థాయిలో సమగ్రంగా నిర్వహించడం లేదని ప్రభుత్వం పేర్కొనడంతో, పథకాల వాస్తవ ప్రయోజనాలు ప్రజలకు అందుతున్నాయా అనే సందేహాలు తలెత్తుతున్నాయని ఎంపీ వ్యాఖ్యానించారు.

ఇదే సమయంలో, PMJJBY, PMSBY బీమా పథకాల కింద అర్హులైన లబ్ధిదారులకు క్లెయిమ్‌లు ఉన్నప్పటికీ వాటి పరిష్కారంలో జాప్యం జరుగుతోందని డా. కడియం కావ్య తెలిపారు. 2026 జనవరి 14 నాటికి PMJJBY కింద 35 క్లెయిమ్‌లు, PMSBY కింద 74 క్లెయిమ్‌లు పెండింగ్‌లో ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది.

గ్రామీణ, అర్ధనగర ప్రాంతాల్లో ఖాతాల యాక్టివేషన్, కేవైసీ (KYC) నవీకరణ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT), బీమా పథకాలపై అవగాహన, క్లెయిమ్ పరిష్కారం వంటి అంశాల్లో ప్రజలు ఇంకా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎంపీ పేర్కొన్నారు. గత ఏడాది జూలై నుంచి అక్టోబర్ వరకు నిర్వహించిన గ్రామ పంచాయతీ సాచురేషన్ క్యాంపెయిన్‌లో నియోజకవర్గ పరిధిలో 1,054 శిబిరాలు నిర్వహించడాన్ని స్వాగతించినప్పటికీ, ఇవి సరిపోవని, నిరంతర చర్యలు అవసరమని స్పష్టం చేశారు.

డార్మెంట్ ఖాతాలు, పెండింగ్ క్లెయిమ్‌ల సమస్యలు కొనసాగితే ఆర్థిక సమావేశం (Financial Inclusion) లక్ష్యం నెరవేరదని హెచ్చరించిన డా. కడియం కావ్య, బలమైన పర్యవేక్షణ వ్యవస్థ, ఇంటింటా సేవలు, ఆర్బీఐ ఒంబుడ్స్‌మన్ ద్వారా వేగవంతమైన ఫిర్యాదు పరిష్కార విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన ఒక్కరూ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలకు దూరం కాకుండా తాను నిరంతరం పోరాడుతానని ఎంపీ స్పష్టం చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు