విజయోస్తు పుస్తకాలు పంపిని చేసిన కలెక్టర్

 


ఫిబ్రవరి 9 | జనగామ

విజయోస్తు–2.0 ద్వారా ఉత్తమ ఫలితాలు
విద్యతోనే బంగారు భవిష్యత్తు – జిల్లాను తొలి స్థానంలో నిలపాలి
పదవ తరగతి విద్యార్థులకు విజయోస్తు పుస్తకాల పంపిణీ
.....జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్

విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలంటే కష్టంగా కాకుండా ఇష్టంగా చదవాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ సూచించారు. 

సోమవారం జనగామ స్టేషన్ రోడ్డులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థుల కోసం నిర్వహించిన విజయోస్తు–2.0 స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థులు తమ లక్ష్యాలను చేరుకోవడానికి స్పష్టమైన టైమ్‌టేబుల్ రూపొందించుకొని క్రమశిక్షణతో అధ్యయనం చేయాలని సూచించారు. విద్యతో సమానమైన సంపద మరొకటి లేదని, పదవ తరగతి విద్యార్థుల జీవితంలో అత్యంత కీలకమైన మైలురాయి అని పేర్కొన్నారు. వార్షిక పరీక్షలను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని, బంగారు భవిష్యత్తుకు దృఢమైన పునాదులు వేయాలని తెలిపారు.

పరీక్షలంటే భయం కాకుండా నమ్మకం, క్రమశిక్షణ, పట్టుదలతో కృషి చేస్తే విజయం ఖచ్చితంగా సాధ్యమవుతుందని అన్నారు. ముందుగా లక్ష్య మార్కులను నిర్ణయించుకొని, వాటిని సాధించేందుకు నిరంతరం శ్రమించాలని సూచించారు. సెల్‌ఫోన్లు, టీవీలు వంటి వాటి వల్ల ఏకాగ్రత దెబ్బతింటుందని, పరీక్షలకు తక్కువ సమయం మిగిలి ఉన్నందున సమయాన్ని వృథా చేయకుండా పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

ప్రణాళికాబద్ధంగా చదువుకోవడం, క్లిష్టమైన సబ్జెక్టులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం, తరచూ పునశ్చరణ చేయడం వల్ల విషయాలపై పట్టు పెరుగుతుందని తెలిపారు. ప్రతిరోజూ చదవడమే కాకుండా రాయడం అలవాటు చేసుకోవాలని, గత సంవత్సరాల ప్రశ్నపత్రాలు, మోడల్ పేపర్లు అభ్యసించడం ద్వారా సానుకూల దృక్పథం ఏర్పడుతుందని అన్నారు. గణితం వంటి క్లిష్టమైన విషయాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.

పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలంటే చేతిరాత స్పష్టంగా ఉండేలా చూసుకోవాలని, విషయాలను అర్థం చేసుకొని ముఖ్యాంశాలను పదే పదే రాసుకోవాలని చెప్పారు. ప్రతి విద్యార్థి “నేను లక్ష్యాన్ని సాధిస్తాను” అనే ధైర్యం, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని తెలిపారు. చదువుతో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలని, పౌష్టికాహారం, సరిపడ నిద్ర, కొద్దిపాటి వ్యాయామం ఏకాగ్రతను పెంచుతాయని సూచించారు. పరీక్షల ముందు సానుకూల ఆలోచనలతో ఉండాలని అన్నారు.

విద్యార్థులు టైమ్‌టేబుల్ ప్రకారం చదువుతూ ఉత్తమ మార్కులతో ఉత్తీర్ణులై జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. అలాగే ఉత్తీర్ణత శాతాన్ని పెంచి, జనగామ జిల్లాను రాష్ట్రంలో తొలి స్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థులు పదవ తరగతి సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలు అడిగి సమాధానాలు పొందారు. అనంతరం కలెక్టర్ విద్యార్థులకు విజయోస్తు పుస్తకాలు, పెన్నులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఏఎంఓ శ్రీనివాస్, హెచ్‌ఎం నర్సింహారెడ్డి, GCDO గౌషీయా బేగం, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు