యూరియా పంపిణీ ఆకస్మిక తనిఖీలు చేసిన కలెక్టర్

 


మహబూబాబాద్, సెప్టెంబర్ 12:
జిల్లా కలెక్టర్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్ శుక్రవారం గార్ల, డోర్నకల్ మండలాల్లో యూరియా పంపిణీ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా గార్ల ప్రాథమిక సహకార సొసైటీ, ములకనూరు, డోర్నకల్ మండలం గొల్లచర్ల సహకార సొసైటీలలో యూరియా పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమయానుసారం, పారదర్శకంగా యూరియా సరఫరా చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రైతుల కోసం పంపిణీ కేంద్రాల్లో త్రాగునీరు, టెంట్లు, అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు.

గార్ల కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ తరగతి గదులు, వంటశాల, డైనింగ్ హాల్, మరుగుదొడ్లను పరిశీలించారు. విద్యార్థులకు రుచికరమైన ఆహారం అందించాలని, అన్ని సబ్జెక్టుల బోధన నాణ్యతపై దృష్టి పెట్టాలని, షెడ్యూల్ ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆయన సూచించారు.

అలాగే గార్ల, డోర్నకల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో రోగులకు అందిస్తున్న సేవలను సమీక్షించారు. సీజనల్ వ్యాధులు, మాత-శిశు మరణాలు నివారించేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఇన్ పేషెంట్, ఔట్ పేషెంట్ రికార్డులు, సిబ్బంది హాజరు రిజిస్ట్రర్లను కూడా తనిఖీ చేశారు.

పాఠశాలలు, ఆసుపత్రుల పరిసరాల్లో పరిశుభ్రత కాపాడాలని కలెక్టర్ ఆదేశించారు. హెల్త్, ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, సానిటేషన్ రంగాల్లో ప్రత్యేక దృష్టి పెట్టి చర్యలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.

ఈ పర్యటనలో డిపిఓ హరిప్రసాద్, నరసింహమూర్తి, తహసీల్దారులు శారద, ఇమ్మానియేల్, ఎంపీడీవో శ్రీనివాస్, వ్యవసాయ శాఖ అధికారులు రామారావు, మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు