ములుగు కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

 



మంగపేట: జిల్లాలోని విద్యా సంస్థలు, సంక్షేమ హాస్టళ్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు జరుగుతాయని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. తెలిపారు. అధికారుల నిర్లక్ష్యం ఏదైనా తేలితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.


శుక్రవారం మంగపేట జడ్‌పి హైస్కూల్‌ను ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్, తరగతి గదులు, డైనింగ్ హాల్‌ను పరిశీలించారు. విద్యార్థుల చదువు స్థాయి గురించి తెలుసుకుని, తెలుగు, ఇంగ్లీష్‌పై పట్టు సాధించాలని ప్రోత్సహించారు. "బాగా చదివి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి" అని విద్యార్థులకు సూచించారు. పాఠశాలలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు ఆదేశించారు.


తరువాత కలెక్టర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి, ఇన్‌పేషెంట్ వార్డు, ల్యాబ్, డెలివరీ రూం, మందుల నిల్వలను పరిశీలించారు. రోగులను కలసి వారి పరిస్థితి, వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. డాక్టర్లు, సిబ్బందికి సరిపడా మందులు అందుబాటులో ఉంచాలని, జ్వరంతో వచ్చే ప్రతి రోగికి మలేరియా, డెంగ్యూ టెస్టులు తప్పనిసరిగా చేయాలని ఆదేశించారు.


అలాగే మండలంలోని విద్యార్థి వసతి గృహాల్లో, అవసరమైన గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించాలని వైద్య అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ నియంత్రణ కార్యక్రమాలను సకాలంలో పర్యవేక్షించాలని సూచించారు.


ఈ కార్యక్రమంలో తహసిల్దార్ రవీందర్, ఎం.పి.ఒ. శ్రీనివాస్, వైద్యాధికారిణి డాక్టర్ స్వప్నిక, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ శారద, సూపర్వైజర్స్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు