పనుల జాతర–2025 కార్యక్రమాన్ని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క



 కొత్తగూడ, గంగారం మండలాల్లో అభివృద్ధి పనుల శంకుస్థాపనలు – రేషన్ కార్డుల పంపిణీ

మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ, గంగారం మండల కేంద్రాల్లో “పనుల జాతర–2025” కార్యక్రమాన్ని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, మొక్కలు నాటి హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం గంగారం రైతు వేదికలో లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేశారు.
కొత్తగూడ మండల కేంద్రంలో రూ.12 లక్షల వ్యయంతో నిర్మించనున్న అంగన్వాడి కేంద్రానికి మంత్రి భూమిపూజ చేశారు. తిరుమలగండి – పూట్టల భూపతి గ్రామాల మధ్య రూ.1.60 కోట్లతో చేపట్టనున్న రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. గంగారం హాస్టల్ గుంపు, ఎంపీడీవో కార్యాలయం ప్రాంగణంలో మొక్కలు నాటారు. గంగారం మండల ప్రజాపరిషత్ నూతన కార్యాలయ భవన నిర్మాణం కోసం రూ.1.50 కోట్ల వ్యయంతో భూమి పూజ చేశారు. అదేవిధంగా మండలానికి చెందిన 825 మంది లబ్ధిదారులకు రేషన్ కార్డులను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పనుల జాతర–25ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని, ప్రతి గ్రామం అభివృద్ధి దిశగా ముందుకు సాగేందుకు పలు పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో సన్న బియ్యం పంపిణీ, రైతు భరోసా, బీమా, రుణమాఫీ, వడ్డీలేని రుణాలు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, గృహజ్యోతి, మహాలక్ష్మీ పథకం కింద సబ్సిడీ గ్యాస్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వంటి పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
గతంలో రేషన్ కార్డుల పంపిణీ లోపాలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నా, ప్రస్తుత ఇందిరమ్మ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు అందిస్తున్నామని చెప్పారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం స్వయం సహాయక సంఘాల ద్వారా వడ్డీ లేని రుణాలు, బస్సులు, పెట్రోల్ పంపులు, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. గంగారం మండలంలో మహిళలకు సోలార్ ఉత్పత్తి, కోళ్ల ఫార్ములు, హార్టికల్చర్ వంటి రంగాల్లో ఉపాధి అవకాశాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా యూరియా కొరత లేకుండా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి సరఫరా సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకున్నామని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఆర్డీఓ కృష్ణవేణి, డీఆర్డీఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదనరాజు, జెడ్పి సీఈవో పురుషోత్తం, డిపిఓ హరిప్రసాద్, డిఎస్ఓ ప్రేమ్ కుమార్, ఏడిఏ శ్రీనివాస్, సిడిపిఓ నిలోఫర్ అజ్మీ, తహసిల్దార్ బాలకృష్ణ, ఎంపీడీవో మున్నార్, ఇంజనీర్లు వీరభద్రం, విద్యాసాగర్, హౌసింగ్ పీడీ రాజయ్య తదితర అధికారులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు