హనుమకొండ, ఫిబ్రవరి 25:
బాల్యవివాహాలను ప్రోత్సహించినా, నిర్వహించినా చట్టపరమైన చర్యలు తప్పవని సన్ ప్రీత్ సింగ్ హెచ్చరించారు. బాల్యవివాహాల నిర్మూలనపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ, జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ (SHARE) స్వచ్ఛంద సంస్థ మరియు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఆధ్వర్యంలో రూపొందించిన ప్రచార రథాన్ని బుధవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ బాల్యం ప్రతి చిన్నారి జీవితంలో కీలకమైన దశ అని పేర్కొన్నారు. బాల్యవివాహాలు పిల్లల విద్య, ఆరోగ్యం, శారీరక మరియు మానసిక అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతాయని తెలిపారు. చిన్న వయసులో వివాహం జరగడం వల్ల చదువు మధ్యలోనే ఆగిపోతుందని, తద్వారా భవిష్యత్తులో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు.
బాల్యవివాహాల నిర్మూలనకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని, ముఖ్యంగా బాలికల విద్యాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని వెల్లడించారు. బాల్యవివాహాలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. చిన్నారుల బాల్యాన్ని కాపాడుతూ వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడం సమాజం మొత్తం బాధ్యత అని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ రవి, ఏహెచ్‌టీయూ ఇన్‌స్పెక్టర్ శ్యామ్ సుందర్, ఎస్‌ఐ సుధాకర్, హెడ్ కానిస్టేబుల్ సమీయుద్దీన్, షేర్ స్వచ్ఛంద సంస్థ జిల్లా కోఆర్డినేటర్లు శిరీష, జ్యానేశ్వరి, జమున, ప్రశాంతి, కల్పన, గాయత్రి, చామంతి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

0 కామెంట్‌లు