భా
రత రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి ప్రామాణికం: ములుగు కలెక్టర్ దివాకర టీ.ఎస్. ములుగు టౌన్ : భారత రాజ్యాంగం ప్రజాస్వామ్య వ్యవస్థకు బలమైన పునాది కాగా, అంబేద్కర్ చూపిన రాజ్యాంగ మార్గంలోనే శక్తివంతమైన దేశ నిర్మాణం సాధ్యమని జిల్లా కలెక్టర్ దివాకర టీ.ఎస్. వ్యాఖ్యానించారు.
బుధవారం ములుగు జిల్లా కేంద్రంలో భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగిన 76వ రాజ్యాంగ ఆమోద దినోత్సవం కార్యక్రమానికి ప్రధాన అతిథిగా హాజరైన కలెక్టర్, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.
తరువాత మాట్లాడిన ఆయన—
“ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం భారత్. నేడు మన దేశం నాలుగవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా నిలవగలగటం రాజ్యాంగం ఇచ్చిన దిశానిర్దేశాల వల్లే. స్వాతంత్ర్యం తర్వాత మనతో పాటు విముక్తి పొందిన ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశం అన్ని రంగాల్లో ముందంజలో ఉండటానికి అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే కారణం” అని పేర్కొన్నారు.
అంబేద్కర్ ను చదువు, రాజకీయ విలువలు, ప్రజాస్వామ్య సిద్దాంతాలు, విధానాల రూపకల్పనలో అపూర్వ నాయకుడిగా కొనియాడుతూ—
“నవంబర్ 26న రాజ్యాంగానికి ఆమోదం లభించడంతో ఈ రోజును రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటాం. జనవరి 26న అమల్లోకి వచ్చినందున దానిని గణతంత్ర దినోత్సవంగా పాటిస్తున్నాం” అని గుర్తు చేశారు.
దేశ స్వాతంత్ర్యం, రాజ్యాంగ నిర్మాణానికి అంబేద్కర్‌తో పాటు అనేకమంది మహనీయుల త్యాగాలు కారణమైందని, వారి ఆశయాలను ప్రతి పౌరుడు పాటించాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో రాజ్యాంగ పరిరక్షణ సమితి సభ్యులు, జిల్లా ప్రముఖులు పాల్గొన్నారు.

0 కామెంట్‌లు