ఎపి సిఎం చంద్రబాబు నాయుడుకు లేఖ రాసిన కల్వకుంట్ల కవిత

 హాథిరాం బావాజీ మఠం కూల్చివేతపై కవిత ఆందోళన



తిరుపతి: హాథిరాం బావాజీ మఠం కూల్చివేత నిర్ణయంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భక్తుల మనోభావాలను గౌరవించి, ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆమె ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును విజ్ఞప్తి చేశారు.

శతాబ్దాల నాటి ఈ మఠ భవనం శిథిలావస్థలో ఉందని మున్సిపల్ అధికారులు పేర్కొంటున్నారు. ఐఐటీ తిరుపతి నిపుణులు కూడా భవనం ప్రమాదకరమని, కూల్చివేసి పునర్నిర్మించాలన్న సూచనలు ఇచ్చారు. దీనిని ఆధారంగా తీసుకొని, ప్రభుత్వం భక్తులు, వ్యాపారుల భద్రత కోసం భవనాన్ని కూల్చివేయాలని నిర్ణయించింది.

అయితే, ఈ నిర్ణయం బంజారా సమాజంలో తీవ్ర ఆవేదన కలిగించింది. హాథిరాం బావాజీని తమ ఆధ్యాత్మిక గురువుగా, కులదైవంగా భావించే ఈ సమాజం, మఠ కూల్చివేతను తమ చరిత్ర, సంప్రదాయాలపై దాడిగా అభివర్ణిస్తోంది. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వ్యవహారాలు కూడా ఈ మఠం ఆధ్వర్యంలో నడిచాయని, వేల ఎకరాల భూములు దానికి అనుబంధంగా ఉన్నాయని గుర్తుచేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేస్తూ, "మఠం కేవలం ఒక భవనం కాదు, బంజారా సమాజానికి అది ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక" అని పేర్కొన్నారు. కూల్చివేత నిర్ణయం భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తోందని, సీఎం చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

ఇంతకుముందు కూడా కవిత, బంజారా పీఠాధిపతులతో కలిసి టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడును కలుసుకుని, కూల్చివేత నిర్ణయంపై పునరాలోచన చేయాలని కోరిన విషయం తెలిసిందే.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు