బుదేరా మహిళా డిగ్రీ కళాశాల తెలంగాణకు రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతాం : మంత్రి దామోదర్ రాజనర్సింహ
అందోల్ నియోజకవర్గంలోని మునిపల్లి మండలంలో శుక్రవారం రూ.70 కోట్ల అభివృద్ధి పనులకు వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్యతో కలిసి పలు గ్రామాలలో పాల్గొన్నారు. అనంతరం స్థానికులతో మాట్లాడారు.
బుదేరా సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ, రానున్న ఆరు నెలల్లో ఈ కళాశాలను రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఆధునిక ల్యాబ్‌లు, డిజిటల్ తరగతి గదులు, మెరుగైన లైబ్రరీ, ఫర్నిచర్, వసతి గృహాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు భద్రతతో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు.
తరువాత జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో సమావేశమైన మంత్రి, పాఠశాలలో మౌలిక వసతులు బలోపేతం చేస్తామని భరోసా ఇచ్చారు. గత వర్షాల ప్రభావంతో దెబ్బతిన్న రహదారులను పరిశీలించిన ఆయన, వెంటనే మరమ్మతులకు అధికారులను ఆదేశించారు.
మండలంలోని తాటిపల్లి – మక్తకేసారం డబుల్ రోడ్డు నిర్మాణానికి రూ.42 కోట్లు, గార్లపల్లి హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.17 కోట్లు, తాటిపల్లి నుండి మక్తా కేసారం వరకు రెండువైపులా రోడ్డు పనులకు రూ.22 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. మునిపల్లి-ఖమ్మంపల్లి రోడ్డు, చందాపూర్ రోడ్డు, తక్కెడపల్లి రహదారులు, మోడల్ స్కూల్, ఎస్సీ బాయ్స్ హాస్టల్, కెజిబివి పాఠశాలల అభివృద్ధి కోసం కూడా నిధులు వెచ్చించనున్నట్లు మంత్రి వివరించారు.
అదే సమయంలో సింగూరు ప్రాజెక్టును టూరిజం హబ్‌గా మార్చే ప్రణాళికను వెల్లడించారు. సింగూరు బ్యాక్ వాటర్ వెంట రెండు లైన్ల రహదారి నిర్మాణానికి రూ.60 కోట్లు మంజూరు చేశామని, రామచంద్రాపురం శివారులో 15 ఎకరాల్లో రిసార్ట్ హోటల్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆధ్వర్యంలో రిసార్ట్‌లు ఏర్పడితే యువతకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయని, రవాణా సౌకర్యాలు మెరుగై గ్రామాల భూములకు విలువలు పెరుగుతాయని మంత్రి పేర్కొన్నారు.
హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న అతిపెద్ద జలాశయం సింగూరులో పర్యాటకులకు పడవ విహారాలు, రిసార్ట్లు, భోజన సదుపాయాలు అందించేలా హబ్‌గా అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. దీంతో తక్కెడపల్లి, గార్లపల్లి, చిల్లపల్లి, మక్తకేసారం, బేలూరు, కోడూరు, సింగీతం, తాటిపల్లి వంటి గ్రామాలు అభివృద్ధి దిశగా పయనిస్తాయని మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంజయ్య, ఆర్‌అండ్‌బి, పంచాయతీరాజ్ అధికారులు, రెవెన్యూ డివిజనల్ అధికారి రవీందర్ రెడ్డి, ఉపాధ్యాయులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు