విజయానికి ఎమోజీ..
రామోజీ..!
Ramoji Rao Success full Emoji
స్కూల్లో అక్షరాలు నేర్చుకుంటున్నప్పుడే ఈనాడులో అక్షరాలు చదవడం మొదలు పెట్టి ఉంటానేమో..
ఈనాడు దినపత్రికలో
శీర్షికల రూపంలో ఉండే పెద్ద అక్షరాలలో ఆఆఇఈలు వెతికి గుర్తు పట్టేవి కళ్ళు..
ఈ అయితే కొట్టొచ్చినట్టు
పేరులోనే కనిపించిన
శిఖరాక్షరం..
కాస్త అక్షర జ్ఞానం పెరిగేటప్పటికి అదే ఈనాడులో మాటలు..
వాక్యాలు..సినిమా బొమ్మలు..గవాస్కర్.. గుండప్ప విశ్వనాథ్ పోటోలు..
ఇలా ఆ పత్రికలో ప్రతి అంశం ఒక బాలశిక్షలా..
రేపటి నా జర్నలిజానికి
అదే శిక్షణలా..
రోజులు గడిచాయి.. క్యాలండర్లు మారాయి..
ఈనాడులో సంచిక.. సంపుటిలు తిరగబడుతూనే ఉన్నాయి.ఆ పత్రికపై ఆసక్తి పెరుగుతూనే ఉంది..
అక్షరాలు ఏరుకుని చదివే దశ నుంచి పుటలు..పేరాలు..
పేజీలు తిప్పుతూ నెమ్మదిగా ఈనాడు చదవడం అనేది ఒక వ్యసనంగా మారింది.
అర్థం కాని రోజుల నుంచి..
అర్థాలు వెతుకుతూ..
అనర్థాల గురించి తెలుసుకుంటూ..
అంతరార్ధాలు తెలుసుకుంటూ..
చాలా పెద్ద ప్రయాణం ఈనాడుతో..ప్రతి నాడు..!
పేపర్ వస్తే చూడ్డం మొదలుకుని..
పేపర్ అందుకోవడం వరకు..
రోజూ ఎదురు చూడ్డం దాకా..రాకపోతే వెళ్లి తెచ్చుకునే దశ.. అలా చదువుతూ ఎప్పటికైనా
మనమూ ఒక జర్నలిస్టు అయితే.. అన్న ఆశ..!
జీవితంలో ఇంకొన్ని పేజీలు తిరిగాయి..ఈనాడులో వార్తలు చదివి..అవగాహన చేసుకుని..జిజ్ఞాస పెంచుకుని..ఆ పత్రికలో వచ్చిన హెడ్డింగులకు
ప్రత్యామ్నాయంగా హెడ్డింగులు..ఆ పక్కనే రాసి..మనదే వాసి అనే చిన్న
లెవెల్.. అప్పటికి మన బుర్ర
ఈనాడుకు పేర్లల్..ఓ భ్రమ..
అయినా భవిష్యత్తు అక్కడే నిర్మాణమై నెరవేరిన ఓ కల..
ఆ పత్రిక ద్వారానే అబ్బిన
రాయడం అనే ఓ కళ..!
ఊహ తెలిసాక..పత్రికా రంగ ప్రముఖుల్లో మొదటగా తెలుసుకున్న ఇద్దరు వ్యక్తులు..ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూపు సంస్థల
చైర్మన్ రామనాథ్ గోయెంకా..ఈనాడు అధినేత
రామోజీరావు..
జాతీయ నాయకుల్లో గాంధీ..నెహ్రూ బొమ్మల్లా…
చిత్రపరిశ్రమలో
ఎన్టీఆర్.. ఏయెన్నార్ పేర్లలా..
గోయెంకా..రామోజీరావు..
ఈ పేర్లు హృదయఫలకంపై
ముద్రించుకుపోయాయి..!
ఈనాడు ప్రస్థానం..
రామోజీరావు
దిగ్విజయ యాత్ర..
పత్రిక గెలుపులు..
దాని మలుపులు..
నలుపు తెలుపులు..
సంచలన మెరుపులు..
రంగుల తళుకులు..
సంపాదకీయ చెణుకులు..
ఎడిట్ పేజీ ఆర్టికల్
విశ్లేషణలు..
కార్టూన్ బాంబులు..
కొన్ని పాలక పక్ష రుబాబులు..
మొక్కవోని ధైర్యంతో
పెద్దాయన జవాబులు..
ఎమర్జెన్సీ రోజుల నాటి
సవాళ్లు..దుర్మార్గపు పాలనను ఎదిరించిన
రుధిరాక్షరాల ఆనవాళ్లు..
1982లో తెలుగు విభవుడు
నందమూరి తారక రామారావు రాజకీయ ఆగమనవేళ సాగిన సంచలన ప్రచార హేల..
చెప్పుకుంటూ పోతే
ఈనాడు లేనిదెక్కడ..
రామోజీ రానిదెప్పుడు..
ఎన్ని ఆలోచనలు..
తొలి పేజీలో కార్టూన్ మొదలు..
బ్యానర్.. ఓ సంచలన వార్త…ఈనాడు ఆదివారంలో
సమరం దుమారం..
హోమియో పావులూరి..
ఆసక్తి పెంచిన పజిల్..
చిన్న పేపర్లు..
ఎన్ని ట్రెండ్లు…
పేలుతూ ఉన్నా అప్పుడప్పుడు
వ్యతిరేక గుండ్లు..!..
రామోజీ..
అక్షరం కాని శిలాక్షరం..
పత్రికా రంగంలో
ఉన్నత సింహాసనం..
ప్రత్యక్షంగానో..పరోక్షంగానో
రాజకీయంలోనూ శాసనం..
జగం మెచ్చిన మేరునగం..
జాతీయ పత్రికా రంగంలో
ఆయనే సగం..
వ్యక్తి..శక్తి..యుక్తి..దీయుక్తి..
రాతగాడికి..
ఆటగాడికి..
పాటగాడికి..
వార్తల వేటగాడికి..
నటుడికి..
రచయితకి..
దర్శకుడికి..
మొత్తంగా కళకి..
కళాకారుడికి..
ఆయన పెద్ద దిక్కు..
అద్భుతం ఆయన దృక్కు..
నిజానికి ఆయనే
88×365 పేజీల
అతి పెద్ద బుక్కు..
తెలుగు జర్నలిజానికి
వేద వాక్కు..!