ఆయన స్వరకల్పనే ఓ విప్లవం..!

Admin
By Admin

ప్రయోగం పుట్టినరోజు…!
_________

ఇళయరాజా జన్మదినం_

++++++++++++++++++

ఆ పాటలో మార్దవం..
అదే పాటలో కోయిలమ్మ
కిలకిలారావం..
వింటుంటే ఆనందం ఆర్నవం..
సప్త స్వరాల..
కోటిరాగాల సముద్భవం..
అది ఇళయరాజాకే సంభవం..
అసలు..
ఆయన స్వరకల్పనే
ఓ విప్లవం..!

మామ మహదేవన్ తో
ఝుమ్మంది నాదం అంటూ
సిరిసిరిమువ్వలు మ్రోగించి
సుస్వరాల
శుభలేఖలు పంచి
శంకరాభరణ రాగంలో
మధురగీతాలు వినిపించిన
కళాతపస్వి
ఈ సంగీత రుషితో
సాగరసంగమం చేసి..
తాను స్వాతిముత్యమై..
ఈ సంగీత సామ్రాట్టును
సిసలైన ఇ”లయ”రాజాగా మలచాడు..
ఇద్దరూ జతగా
అపురూప గీతాలతో
సంగీత సరస్వతిని కొలిచారు..!

సుస్వరం ఆయన ఇంటిపేరు
మధురస్వరం ముద్దుపేరు..
జతులు..వాటిలో కొత్తజాతులు..
కృతులు..
అందులో
కొంగొత్త ఆకృతులు..
ఆయన ఉగ్గుపాలతో
నేర్చిన సంగతులు..
రాజా సంగీతంతో
సందె పొద్దుల కాడ
సంపెంగ నవ్వింది..
సగం రాత్రిలో
నూతి గట్టు మీద
తకిట తధిమి
తకిట తధిమి దిల్లాన..
ఎదల లయల
జతుల గతుల దిల్లాన..
అదే రొమాంటిక్ మూడ్ లో ఉంటే…మౌనమేలనోయి
ఈ మరపురాని రేయి..
కొత్తకొత్త రాగాల కోసం
ఆ స్వర మాంత్రికుడి
నిత్య అన్వేషణ..
ఇటు ప్రయోగాల ప్రయాణం..
అటు రాజీ పడని
పదనిసల ప్రమాణం..
శ్రీరామరాజ్యం తో ఆధ్యాత్మికతకు తిరుగులేని పట్టాభిషేకం..!
అలా అయ్యాడు
ఈ మాస్ట్రో
సంగీత సామ్రాజ్య ప్రియపరిపాలక!

సంగీతం ఆయనకో యాగం
ప్రతి రాగం ఓ ప్రయోగం..
స్వరజ్ఞాని..
మధురగీతాల విజ్ఞాని..
ప్రతి ఇంటా ప్రతి పూట
ఆయన పాట..
వినిపిస్తుంటే విరియదా
వాకిట స్వరాల పూదోట..!
రాసలీల వేళ..
రాయబారమేల..
ఇళయరాజా పాట
వినబడుతుంటే ఇంకా
గుండె భారమెలా..!
********
మాస్ట్రో ఇళయరాజాకు పుట్టినరోజు శుభాకాంక్షలతో..

సురేష్ కుమార్
9948546286

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *