నీ లయే విలయం!
ప్రపంచ పర్యావరణ దినం
🌴🌴🌴🌴🌴🌴🌴
ఎలిశెట్టి సురేష్ కుమార్
*9948546286*
*9948546286*
✍️✍️✍️✍️✍️✍️✍️
పంచభూతాలను
మింగేసే ఏకైక భూతం
మనిషి అనబడే నువ్వే..
బలిసిన నీ కొవ్వే..
విధం చెడి విషం కక్కి
స్వార్థమే పరమార్థమై
నువ్వు చేసే పనులన్నీ
పర్యావరణానికి చేటు..
ఒకనాటికి అదే
నీ అంతానికి ఆరంభం..
అప్పటివరకు
అలా సాగుతూనే ఉంటుంది
ఈ విధ్వంసకర సంరంభం!
నీకంటే ముందు
పుట్టిన భూమి..
నీ కన్న తల్లిని
మించిన అమ్మ..
ఎన్ని దాచి ఉంచింది
నీ కోసం తనలో..
ఎంతెంత పోగు చేసి పెట్టింది వనిలో..అవనిలో..!
పాలిచ్చి..లాలించేది తల్లి..
మొత్తం నీకే అర్పించి
మోడుగా మిగిలేది నేలతల్లి..
అలాంటి అమ్మకు
నువ్విచ్చే కానుక..
భరించలేని గర్భశోకం..
బీడుగా మార్చేసే
భయంకర శాపం!
వేనవేల వత్సరాల కేళిలో
భూమి ఉద్భవించినాక..
నువ్వు పుట్టాక..
ఎప్పుడో మొదలైన
నీ విధ్వంసకాండ..
హిరోషిమా నాగసాకితో
పరాకాష్టకు చేరి..
బాలకాండను..
అరణ్యకాండను..
సుందరకాండను
ఖండఖండాలుగా చేస్తే..
ఇప్పుడేమి మిగిలింది..
నీ ఆయువుతో నువ్వే చేస్తున్న యుద్ధకాండ..
భూగోళమే కాబోతోంది
ఓటి కుండ..!
నిన్ను మోస్తూ..అన్నీ ఇస్తూ
నీ పాపాలను భరిస్తూ..
నువ్వు పెట్టే
హింసలను సహిస్తూ
ఇన్నాళ్లూ.. ఇన్నేళ్ళూ
రోదించింది తల్లి భూమి..
నీకు వినిపించ లేదా ఏమి..?
కట్ట తెగింది.గుండె పగిలింది..
ఇది నువ్వు,నేను
మనందరం చేసిన తప్పు..
కొనితెచ్చుకున్న ముప్పు..
పాపం పండినట్టే..
ఆయువు మూడినట్టే..!
మండుతోంది భూగోళం..
ఎండుతోంది పాతాళం..
చినుకు రాలదు
చిగురు మొలవదు..
ఆరుగాలాలు పోయి
ఎండకాలమె మిగిలింది..
క్రతువులు చేస్తే
రుతువులు మారేనా..
చెరువులు నిండేనా?
అంతా వృధా.. వ్యధా..
చేతులు కాలినాక
పట్టేందుకు ఆకులు
సైతం మిగలని కాలం…
కలికాలం..ఆకలికాలం..
తరుముకొస్తున్న ప్రళయం..
ముంచుకొస్తోంది విలయం..
ఎగసిపడుతున్న
వెచ్చటి ద్రవం
ఇదే కదా విధ్వంసక ఉపద్రవం..!
నువ్వు మారవు..
నీ కష్టాలు తీరవు..
అటు చూడు
కాష్టాలు నిండుతున్నాయి
నువ్వు తినే తిండిలో కల్తీ..
పీల్చే గాలిలో కాలుష్యం..
నీ మనసులో పాడుబుద్ధి..
నీ రోగాలు..
నీ పిల్లల అంగవైకల్యాలు..
రేపటి నీ తరాలను సైతం నాశనం చేసే
నీ వికృతచేష్టలు..
విధ్వంసానికి పరాకాష్టలు!
ఇకనైనా మారితే..
ఇప్పటికైనా కళ్లు తెరిస్తే..
నీ విధ్వంసాన్ని
కొంతైనా తగ్గిస్తే..
ముంచుకొచ్చే విలయాన్ని..
తరముకొచ్చే ప్రళయాన్ని
ఎటూ ఆపలేం..
కనీసం వేయగలిగితే వాయిదా..
రేపటి నీ తరాలకు
కొంతైనా ఫాయిదా..!
నిన్ను..నీ తరాలను
కాచే తల్లి గుండెలు పగిలేలా
రోదిస్తోంది చూడు..
ఆమె తాపం..పరితాపం..
ఒకనాటికి అది
నువ్వు భరించలేని శాపం..
గుర్తుంచుకో..!
************************