భవిష్యత్ ఏమిటి
బిఆర్ఎస్ పార్టి కింకర్తవ్యం
ఎక్కడ కెసిఆర్ స్ట్రాటెజి బెడిసింది
తెలంగాణ ఉద్యమ కెరటమై నిలిచి తెలంగాణ రాష్ట్ర సాదనలో కీలక భూమిక పోషించిన బిఆర్ఎస్ పార్టి పూర్తిగా చతికిల పడి పోయింది. తెలంగాణ లో ఆపార్టి భవితవ్యం ఏమిటనేది ఇప్పుడు ప్రశ్నార్దకంగా మారింది.
అసెంబ్లి ఎన్నికల్లో అధికారం కోల్పోయి చావు తప్పి కన్ను లొట్ట పోయినట్లు 39 స్థానాలు గెలిచిన బిఆర్ఎస్ పార్టీ కి పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా ఫలితం లభించింది.
కాంగ్రేస్, బీజేపీ పోటా పోటీగా పార్లమెంట్ ఎన్నికల్లో తలపడి చెరో 8 స్థానాలు దక్కించుకున్నాయి.
బిఆర్ఎస్ పార్టి కనీసం మెదక్ లో అయినా గట్టి పోటి ఇచ్చి గెలిస్తే పరువు నిలబడేది. పార్లమెట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టి మూడో స్థానంలోకి పడి పోవడం దారుణం.
అసెంబ్లి ఎన్నికల్లో ఆదరించిన జంట నగరాల ఓటర్లు పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే సరికి పూర్తిగా బీజెపి వైపు షిప్టు అయ్యారు. ఆంధ్రాలో చంద్రబాబు NDA- బిజెపి కూటమిలో ఉన్న కారణంగా ఈ ఎన్నికల్లో జంటనగరాల్లో ఉన్న తెలుగుదేశం పార్టి ఓట్లు గంపగుత్తగా బిజెపీకి పోలయ్యాయి.
అధికారంలో ఉన్న కాంగ్రేస్ పార్టీ సైతం ఎన్ని వ్యూహాలు పన్నినా జంటనగరాల్లో పట్టు సాదించ లేక పోయింది. బిఆర్ఎస్, కాంగ్రేస్ మద్య పోరు బీజెపీకి లాభించింది.
అధైర్యపడొద్దని 24 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో అనేక ఆటు పోట్లను చూసినట్లు బిఆర్ఎస్ పార్టి నేతలు కెటిఆర్, హరీశ్ రావు పార్టి క్యాడర్ కు ధైర్యం నూరి పోసే సందేశాలు పంపినా పార్టి నాయకులు, కార్యకర్తలు మాత్రం ఆలోచనల్లో పడ్డారు.
పవర్లో లేకుంటే పనులు కాని ఈ రోజుల్లో పార్టి నేతలు కార్యకర్తలు ఇంకా పార్టీని పట్టుకుని వేళ్లాడే పరిస్థితి కనిపించడం లేదు.
అసెంబ్లీ ఎన్నికల కు పార్లమెంట్ ఎన్నికల నాటికే ఓటర్లు కూడ బిఆర్ఎస్ కు ముఖం చాటేసిన పరిస్థితి కనిపించింది.
జాతీయ పార్టీలకు తప్ప బిఆర్ఎస్ పార్టీని గెలిపించాలన్న ఆలోచన ప్రజల్లో కనిపించలేదని ఎన్నికల ఫలితాలు చూస్తే తేలిపోయింది.
ఈ పరిస్థితుల్లో బిఆర్ఎస్ పార్టీ మనుగడ ఏంకానుందనేది చర్చ జరుగుతోంది. ఉన్న ఎమ్మెల్యేలు కూడ పక్క చూపులు చూస్తున్నారన్న వార్తలు ఇది వరకే వచ్చాయి.
కెసిఆర్ కాని కెటిఆర్ కాని చివరికి క్రిటికల్ మేనేజ్ మెంట్లో దిట్టగా పేరున్న ట్రబుల్ షూటర్ హరీశ్ రావు చెప్పినా పార్టీలో ఎవరూ వినే పరిస్థితి లేదు.
కెసిఆర్ జాతీయ రాజకీయాలంటూ మొదలు పెట్టినప్పటి నుండి ఆయన అటు ఎన్డిఏ లో లేక ఇటు ఇండియా కూటమిలో లేక త్రిశంకు స్వర్గంలో కొట్టు మిట్టాడి ఈ పరిస్థితి తెచ్చుకున్నాడన్న విమర్శలు ఉన్నాయి.