గాలిలో వచ్చిన తప్పుడు వార్తను వాట్సాప్, ట్విట్టర్ లో పెట్టినందుకు కేసులు ఎదుర్కొంటున్న ఆ సీనియర్ జర్నలిస్టులు
చిన్న వీడియో వాట్సాప్లో వస్తే చాలు.. దానిని వెంటనే ఫార్వార్డ్ చేసేయాలి..
ఇతరులకు పంపేయాలి.. అది నిజమో! కాదో! ఎప్పుడు..? ఎలా? జరిగిందో మనకవసరం..
మన మొబైల్లోకి వచ్చింది.. అంతే దానిని ఫార్వర్డ్ చేసేయాలి అంతే.. ఇదీ ప్రస్తుతం జనం తీరు..ఇక మీడియా ప్రతినిధులైతే.. అస్సలు చెప్పక్కర్లేదు.. ఇదే, మాదిరి ఒక వాట్సాప్ గ్రూప్ లోవచ్చిన మెసేజ్ ను ఒక సీనియర్ జర్నలిస్ట్ ఇతర మీడియా గ్రూపుల్లో కి ఫార్వార్డ్ చేయడం, ఆ మెసేజ్ సరైనదా కాదా అనేది క్రాస్ చెక్ చేసుకోకుండా మరో ఆంగ్ల దినపత్రిక సీనియర్ రిపోర్టర్ మరింత ఉత్సాహంతో దానిని, ఏకంగా తన ట్విట్టర్ లో పెట్టడంతో జరిగిన పరిణామాల్లో వారిద్దరూ పోలీస్ కేసును ఎదుర్కొంటున్నారు.
దీని వివరాలకొస్తే, ‘విది నిర్వహణలో ఉన్న ఏ ప్రభుత్వ ఉద్యోగిపైనా… ఎవరైనా దాడి చేసినా, దుర్బాషలాడిన వారిపై కేసులు నమోదు చేయాలని తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత అధికారి అన్ని శాఖల అధికారులను ఆదేశించారు’ అనే వార్త ఏ వాట్సాల్ప్ గ్రూపులో వచ్చిందేమోగానీ, దానిని ఒక ఎలక్ట్రానిక్ మీడియా సీనియర్ రిపోర్టర్ తన ఛానెల్ లో ఫ్లాష్ న్యూస్ ఇచ్చి, దానిని ఇతర వాట్సాప్ గ్రూపుల్లోనూ సర్క్యులేట్ చేశారు.ఈవార్త సరైనదా, కాదా అన్న విషయాన్ని సెక్రెటేరియట్ అధికారులను గానీ, సమాచార అధికారులను గానీ అడగకుండా వాట్సాప్ గ్రూపుల్లో వచ్చిన ఆ వార్తను ఏకంగా తన ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు మరో ఆంగ్ల పత్రిక సీనియర్ విలేకరి. ఈ ట్విట్టర్ పెద్ద ఎత్తున ప్రాచుర్యానికి గురికావడంతో, ఆ వార్త తాము గానీ, జీఏడీ నుండి గానీ జారీ చేయలేదని అధికారులు తేల్చారు. ఇంకేముంది, ఈ తప్పుడు వార్తను వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రాచుర్యం చేసిన ఆ ఇద్దరు విలేకరులపై కేసులు నమోదు చేయాలని ఆ ప్రధానాధికారి ఆదేశించడంతో వారిపై కేసులను పోలీసులు పెట్టారు.
దీనితో, పలు వాట్సాప్ గ్రూపుల్లో వచ్చిన వార్తను పొరపాటుగా పెట్టామని, తమపై నమోదైన కేసును ఉపసంహరించుకోవాలని ఆ ఉన్నతాధికారిని కలవడానికి వారు చేసిన ప్రయత్నాలు విఫలమైయ్యాయి. ఇప్పటికీ, వారిపై కేసు అలాగే ఉంది. సరే, ఆ కేసుతో ఏమీ కాదని కొందరు మిత్రులు వారికి ధైర్గ్యం చెప్పినప్పటికీ, కేసు,కేసేగా అని వారు ఆందోళన పడుతున్నారు.
అందుకే,సామాజిక మాధ్యమాలలో వచ్చే పలు అంశాలను క్రాస్ చెక్ చేసుకోకుండా, ఇతర గ్రూపులకు ఫార్వార్డు చేయడం… తమ కష్టాలను తామే కోరి తెచ్చుకోవడమే అని ఈ ఉదంతం తెలియచేస్తోంది. అందులోనూ, సీనియర్ అధికారులు, ప్రజా ప్రతినిధులపై వచ్చే వార్తలు లేదా ఇతర విషయాలపై వెంటనేస్పందించవద్దు. అందుకే, సోషల్ మీడియా వార్తలపై బీ కేర్ ఫుల్.
కె. వెంకట రమణ
ఈ రచయిత పౌర సంభందాల శాఖ సీనియర్ అధికారి
తేదీ. 30 .5 .2024